అంతర్వేది ఆలయపాసులపై ఏసుక్రీస్తు బొమ్మ
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ క్షేత్రం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు మీడియా ప్రతినిధులకు జారీ చేసిన పాసుల వెనుక ఏసుక్రీస్తు బొమ్మ ఉండడం వివాదానికి దారితీసింది. దీనిపై ఆగ్రహించిన బీజేపీ, వీహెచ్పీ నేతలు అన్యమత ప్రచారానికి అవకాశం కల్పించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఆలయం వద్ద ధర్నా నిర్వహించారు.
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జనవరి 26 నుంచి స్వామి వారి కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 4 తో ముగుస్తాయి. ఈ కార్యక్రమాలను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులకు ఆలయ అధికారులు జనవరి 26నే పాసులు జారీ చేశారు. వీటిలో కొన్నింటి వెనుక ఏసుక్రీస్తు ఫొటో, కొన్నింటి వెనుక క్రైస్తవ మత సాహిత్యం ముద్రితమై ఉండడంతో ఆ విషయం బీజేపీ, వీహెచ్పీ నేతలకు తెలిసింది. దాంతో వారు కొన్ని పాసులను తీసుకుని ఆదివారం ధర్నాకు దిగడంతోపాటు, ఆలయ అధికారులపై రాజోలు సీఐ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. కాగా, పాసుల తయారీ, ప్రింటింగ్ బాధ్యతలను ఆలయ అధికారులు నరసాపురంలోని ఓ ప్రింటింగ్ సంస్థకు ఇచ్చినట్లు తెలిసింది. సదరు సంస్థ చెన్నై నుంచి ముడి సరుకు తెప్పించి దేవస్థానం సూచించినట్లుగా ముద్రించి పంపించింది. అయితే, వాటి వెనుక ఏసుక్రీస్తు ఫొటో ఉండడాన్ని తాము గమనించలేదని ఆలయ అధికారులు అంటున్నారు.
(సఖినేటిపల్లి)