ఎన్నికలు బహిష్కరించిన జాంగోలా గ్రామస్థులు
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తూర్పు ఢిల్లీలోని నరేలా నియోజకవర్గంలోని జాంగోలా గ్రామ ప్రజలు ఈసారి ఓటు వేయకుండా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. తమ గ్రామంలో ఆస్పత్రి, పాఠశాల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాంగోలాలో 10వేల జనాభా నివసిస్తున్నారు. ఇక నాయకులను నమ్మేది లేదన్నారు. ఎన్నికల సమయంలో తమను ఓటు అడగానికి వచ్చే నాయకులు ఎన్నికలముందు ఇచ్చిన తప్పడు వాగ్దానాలతో ప్రతిసారి మోసం చేస్తున్నారని ఓ గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎన్నికలప్పుడూ ప్రతి పార్టీ నాయకుడు వచ్చి ఓట్లు అడుగుతారు. నాయకులు చెప్పిన మాటలు నమ్మి ఎదురుచూడటమే తప్పా ఏ పార్టీ నాయకుడు తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ పంజా సింగ్ అనే గ్రామస్తుడు ఆరోపించాడు. తమ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఒక ఆస్పత్రి, పాఠశాల లేకపోవడం విచారకరమన్నాడు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ నాయకుడు నీలదామన్ కత్రీ గెలుపు సాధించారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి ఆస్పత్రి, పోస్టు ఆపీసు, హై స్కూలు వంటి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పినట్టు సింగ్ విమర్శించాడు.