యూఎస్, యూకేల్లో జిల్మోర్ సేవలు
రూ.కోటి నిధుల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కళాకారుల సేవల్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన జిల్ మోర్ సంస్థ... విస్తరణ బాట పట్టింది. తొలి దశలో అమెరికా, యూకే దేశాలకు విస్తరిస్తున్నామని, మరో ఆరు నెలల్లో మలేషియా, సింగపూర్, యూఏఈ, దుబాయ్, కెనడా, స్విట్జర్లాండ్ దేశాలకూ విస్తరిస్తామని జిల్ మోర్ కో-ఫౌండర్, సీఈఓ సారథి బాబు రసాల చెప్పారు. సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విస్తరణ నిమిత్తం యూకేకు చెందిన పలువురు ఎన్నారైలు, మిత్రుల నుంచి కోటి రూపాయల నిధులను కూడా సమీకరించినట్లు తె లియజేశారు.
ఇప్పటివరకు జిల్ మోర్లో 500 మంది కళాకారుల తమ పేర్లను నమోదు చేసుకున్నారని... 10 నెలల కాలంలో 350 బుకింగ్స్ పూర్తి చేశామని చెప్పారు. విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసేందుకు ఫ్రాంచైజీ రూపంలో భాగస్వామ్యం అందించాలని కూడా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలోని 7 రాష్ట్రాల్లో వరప్రసాద్ కందగట్ల, యూకేలో వెంకట్ నీల బృందం ఫ్రాంచైజీలు తీసుకున్నారని వెల్లడించారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు, కార్పొరేట్ ఈవెంట్స్, వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక రోజుల్లో గాయకులు, యాంకర్లు, సెలబ్రిటీలు, ఆర్టిస్టులు వంటి కళాకారుల సేవల్ని బుకింగ్ చేసుకునే సేవలందిస్తోంది జిల్ మోర్. కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం, జిల్ మోర్ ఫౌండర్ మాధురి, హైదరాబాద్ ఏంజిల్స్ డెరైక్టర్, మెంటార్ వివేక్ వర్మ, కన్నడ సినీ నటి యమున శ్రీనిధి కూడా పాల్గొన్నారు.