రానున్నది మహర్దశ
చేవెళ్లరూరల్: రానున్న రోజుల్లో నగరానికి 39 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతమంతా గతంలో చూడని విధంగా అభివృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. చేవెళ్ల మండలం ఖానాపూర్ గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఆయన అల్లుడు నిర్వహించిన అబిషేకపూజ కార్యక్రమంలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
పాలనలోకి వచ్చిన రెండు నెలలకే ఇది చేయలేదు,అది చేయలేదనటం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉంటే ఎన్ని రేషన్‌కార్డులు ఉన్నాయనీ, దీనికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి అవకతవకులు లేకుండా ఉండేందుకే సమగ్ర సర్వే జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేనివిధంగా ఈనెల 19న జరిగిన సమగ్ర సర్వేది గొప్ప చరిత్ర అన్నారు. ఈ ఆగస్టు 19 సర్వేడేగా మిగిలిపోతుందన్నారు. మన రాష్ట్రంలోని యువతకు 60నుంచి 70వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
నగరానికి చుట్టూ ఉన్న ప్రాంతాలు కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చెందనున్నాయన్నారు. భూముల ధరలు బంగారం కానున్నాయని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌గా అన్ని పార్టీలు సమానమేనని తెలిపారు. మండలి చైర్మన్ పోస్టు అనేది జిందా తిలస్మాత్ మందు లాంటిదని, అన్ని రోగాలకూ అది ఎలా పనిచేస్తోందో అలాగే చైర్మన్‌గా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సామ రవీందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, జనార్దన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.