అన్ని చెరువులకు జియో ట్యాగింగ్
త్వరలో మూడోదశ: హరీశ్
సాక్షి, హైదరాబాద్: త్వరలో మిషన్ కాకతీయ మూడో దశ పనులు చేపట్టనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇటీవలి భారీ వర్షాలతో చాలా చెరువుల్లో నీళ్లు నిలిచి ఉన్నందున అంచనాలు రూపొందించే పని సకాలంలో జరగక పోవటంతో మూడోదశలో కొంత జాప్యం జరిగిందన్నారు. వర్షాలతో రెండో దశలో ఆగిపోయిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. మరో వారం పది రోజుల్లో చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తి చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని వెల్లడించారు.
ఎన్ఆర్ఎస్ఏ, ఇస్రోల సాయంతో చెరువుల వివరాలే కాకుండా వాటి పరిధిలో పంటల వివరాలను కూడా ప్రజల ముందుంచే ఏర్పాటు చేసినట్టు వివరించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్షాలకు చెందిన చల్లా ధర్మారెడ్డి, బాబూరావు రాథోడ్, వీరేశం, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కొత్త చెరువులను కూడా మిషన్ కాకతీయలో చేపట్టేందుకు సిద్ధమన్నారు.
మొదటి దశకు రూ.2,595 కోట్లు
మిషన్ కాకతీయ తొలి దశలో 8,165 చెరువులకు గాను రూ.2,595 కోట్లు మంజూరు చేయగా.. రూ.1,295 కోట్లు ఖర్చు చేసినట్లు హరీశ్ తెలిపారు. రెండో దశలో రూ.3,135 కోట్లు మంజూరు చేయగా 1,536 చెరువుల పనులను పూర్తి చేసినట్టు వెల్లడించారు.
నాగార్జున చెరువు కబ్జా ఆరోపణలపై చర్యలేవీ?
నటుడు నాగార్జున హైటెక్‌సిటీ చేరువలో గురు కుల్ ట్రస్టు భూముల సమీపంలోని చెరువును సగం మేర కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినా చర్యలెందుకు తీసుకోలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హరీశ్ బదులిస్తూ.. అది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నందున ఆ బాధ్యత సంబంధిత శాఖదేనని చెప్పారు.