జీజీహెచ్‌లో జీవన్‌దాన్ కమిటీ పర్యటన
- గుండె, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు త్వరలో అనుమతిస్తాం
- మీడియాతో డాక్టర్ రవిరాజు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో గుండె, కిడ్నీలు మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చేందుకు జీవన్‌దాన్ కమిటీ శుక్రవారం ఆస్పత్రిలో పర్యటించింది. జీవన్‌దాన్ కమిటీ చైర్మన్, డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ఆధ్వర్యంలో వైద్య బృందం ఆసుపత్రిని పరిశీలించారు. స్పెషాలిటీ వైద్యులు ఆపరేషన్లు చేసేందుకు నిబంధనల మేరకు సరిపడా ఉన్నారా, లేరా, వారు ఎప్పటి నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు తదితర విషయాలను వైద్యులను పిలిపించి విచారించారు. ఆపరేషన్ థియేటర్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలు నిబంధనల మేరకు ఉన్నాయా లేవా, రోగులకు వైద్య సౌకర్యాలు ఏ మాత్రం ఉన్నాయనే విషయాలను అధ్యయనం చేశారు.
అనంతరం డాక్టర్ రవిరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక గత జనవరిలో ఆంధ్రప్రదేశ్‌కు నూతనంగా జీవన్‌దాన్ పథకాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం విశాఖపట్నంలో మాత్రమే ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందని, జీజీహెచ్‌లో అనుమతులు మంజూరు చేశాక రెండో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుందన్నారు. గుండె, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వసతులను పరిశీలించామన్నారు. త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
మేము సిద్ధం : జీజీహెచ్ సూపరింటెండెంట్
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ జీజీహెచ్‌లో నిపుణులైన వైద్యులు ఉన్నారని, అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉన్నారని, ఆధునిక వైద్య పరికరాలు ఉన్నాయని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పలపాటి సూర్యకుమారి, ఆయుష్ హాస్పటల్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ, జీవన్‌దాన్ పథకం చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ గాదె కృష్ణమూర్తి, న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారావు, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు.
డాక్టర్ గోఖలేకు అభినందనలు
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీలు పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ రవిరాజు అభినందించారు. దేశంలోనే గుండెమార్పిడి ఆపరేషన్లు చేసిన మొట్టమొదటి వ్యక్తి జీజీహెచ్‌లో పేదరోగులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.