హామీల బాబూ.. గోబ్యాక్
కర్నూలు(అర్బన్):
ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు అనేక హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ అన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్న చంద్రబాబును విద్యార్థులు, నిరుద్యోగులు ‘గో బ్యాక్’ అంటు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.
శనివారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లక్ష్మీనరసింహ మాట్లాడుతు విద్యార్థుల ఉపకార వేతనాలకు ఆధార్ లింకు తొలగిస్తానని.. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితి కలిగిన వారికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.
అయితే ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కళాశాల విద్యార్థికి ట్యాబ్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీతో పాటు ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత బస్ పాస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు భృతి విస్మరించారని.. పెరిగిన ధరలకు అనుగుణంగా సవరిస్తామన్న మెస్ చార్జీల ఊసే కరువైందన్నారు. ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 90 శాతం రాయితీ కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను మోసగించారన్నారు.
యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్లు, పాలకమండళ్లలో బీసీలకు 33.1/3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటకు కృషి చేస్తామని చెప్పిన బాబు ఇప్పుడు నోరు మెదపకపోవడం తగదన్నారు. త్వరలోనే చంద్రబాబు హామీలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. సమావేశంలో రాయలసీమ యూనివర్సిటీ నాయకులు మురళి, తిలక్, రాజు, రాజశేఖర్, తిమ్మయ్య, సుభాష్, నాగేంధ్ర, శంకర్ తదితరులు పాల్గొన్నారు.