కార్యాలయాన్ని ఖాళీ చేయండి!
* ఏపీ ఉన్నత విద్యామండలికి జేఎన్‌ఏఎఫ్‌యూ లేఖ
* ముదిరిన విద్యా వివాదం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తమ భవనాన్ని సత్వరమే ఖాళీ చేయాలని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌యూ) మంగళవారం లేఖ రాసింది. తరగతుల నిర్వహణకు వసతి చాలక ఇబ్బందిగా ఉందని, త్వరగా ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలని ఆ లేఖలో స్పష్టం చేసింది. 2015-16 విద్యాసంవత్సరానికి ఎంసెట్ సహా అన్ని సెట్లను ఉమ్మడిగా నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జేఎన్‌ఏఎఫ్‌యూ భవనాన్ని ఖాళీ చేయాలని లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఏర్పాటైన తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని, రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించే అధికారం తమకే ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నాయి.
నెలకు రూ.3 లక్షల అద్దె
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 1988లో ఉమ్మడి ఏపీ చట్టం ప్రకారం ఏర్పాటైంది. తొలుత దీన్ని లక్డికాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. 2005లో మాసబ్‌ట్యాంకులో ఉన్న జేఎన్‌ఏఎఫ్‌యూ ఆవరణలోని మూడంతస్తుల భవనంలోకి తరలించారు. కరెంటు, నీటి చార్జీలతోపాటు ప్రతి నెలా రూ.3 లక్షలు ఈ భవనం కోసం మండలి వెచ్చిస్తోంది. మొదటి అంతస్త్థులో ఏపీ మండలి ఉండగా, రెండో అంతస్తులో తెలంగాణ మండలి ఉంది.