ప్రయాణికుల భద్రతపైనే దృష్టి
విశాఖ రైల్వే స్టేషన్లో కేంద్ర ఇంటెలిజెన్స్ బృందం పర్యటన
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రతపై కేంద్ర నిఘా విభాగం దృష్టి సారించింది. రైల్వే స్టేషన్లో మరిన్ని పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రైల్వే ఇంటిలిజెన్స్ బృందం అభిప్రాయపడుతోంది. ముగ్గురు సభ్యులతో కూడి న కమిటీ రెండు రోజులుగా విశాఖ స్టేషన్లో పర్యటిస్తోంది. గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఇంకా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రత రైల్వే ఆస్తుల పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
ప్లాట్‌ఫాంతో బాటు స్టేషన్ పరిసరాల ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు రైల్వే స్టేషన్లోకి సులభంగా ప్రవేశించేందుకు అనువుగా ఉన్న ప్రాంతాలను మూసివేయాలని సూచించారు. ఒకటో నెంబర్ ప్లాట్ఫారం ఆర్ఆర్ఐ కేబిన్ ఎదురుగా వున్న రెండు అనధికారిక మార్గాలను మూసివేయాలని నిర్ణయించారు.
జ్ఞానాపురం మార్గం వైపు కూడా కొన్ని సూచనలు చేశారు. రైల్వే నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగి స్తున్న స్టాల్స్ సిబ్బందిపై నిరంతరం దృష్టి సారించాలని కోరారు. రైళ్లలో రవాణా అవుతున్న పదార్థాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని నిఘా బృం దం స్థానిక రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. తినుబండారాల ముసుగులో అక్రమ రవాణా పై నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు.