వచ్చే వారం 12 బిల్లులు
ఉభయ సభల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్య, జేఎన్యూ వివాదాలతో అట్టుడుకుతున్న పార్లమెంటులో వచ్చే వారం ఆర్థిక, పాలనా అంశాలకు చెందిన 12 కీలక బిల్లులు చర్చకు రాబోతున్నాయి. అందులో లోక్సభలో ఏడు, రాజ్యసభలో ఐదు బిల్లులున్నాయి. సోమవారం(శివరాత్రి) సెలవు ఉండడంతో వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు ఉంటాయి. మళ్లీ శని, ఆదివారాలు సెలవు అనంతరం మార్చి 16 వరకు మరో మూడు రోజులు సమావేశాలతో తొలిదశ ముగియనుంది.
ఈ లోగానే లోక్సభలో శత్రు ఆస్తులు (సవరణ, క్రమబద్ధీకరణ) బిల్లు, ఆధార్ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, ప్రయోజనాలు, సేవల బదిలీ) బిల్లు, రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వుల సవరణ బిల్లు, రైల్వేలకు, ఇతర సాధారణ డిమాండ్లు, గ్రాంట్లకు సంబంధించిన 4 వినియోగ బిల్లులు చర్చకు రానున్నాయి.
రాజ్యసభలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిల్లు, విజిల్ బ్లోయర్స్ రక్షణ (సవరణ) బిల్లు, బాల కార్మికుల (నిరోధం, నియంత్రణ) సవరణ బిల్లుతో పాటు రైల్వే, సాధార ణ బడ్జెట్లకు సంబంధించిన వినియోగ బిల్లులు చర్చకు రానున్నాయి. వీటితోపాటు రియల్ ఎస్టేట్ (అభివృద్ధి, నియంత్రణ) బిల్లును కూడా రాజ్యసభలో చర్చించే అవకాశముందని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి నఖ్వీ పేర్కొన్నారు.