Job Connect
-
35 కంపెనీలు.. 3 వేల పోస్టులు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నగర మహిళల భద్రతకే కాదు.. వారి ఆర్థిక పురోభివృద్ధికి షీటీమ్ పాటుపడుతోంది. షీ టీమ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆవరణలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నగరమహిళల కోసమే ఏర్పాటు చేసిన జాబ్‌కనెక్ట్ కార్యక్రమమే అందుకు తాజా ఉదాహరణ. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేలమంది నగర మహిళలు పాల్గొనగా 35 కంపెనీలలో మూడు వేలమంది నిరుద్యోగ మహిళలు ఉద్యోగాలు దక్కించుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, హెచ్ఆర్ మేనేజర్లు, రిక్రూటర్లు పాల్గొని ఇంటర్వ్యూ లు నిర్వహించారు. సుమారు 3 వేల ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలలో పలువురు ఆఫర్ లెటర్లు అందుకు న్నారు. పోలీసులు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఎంఐఎస్) సంయుక్తంగా చేపట్టిన ఈ తొలి ప్రయత్నానికి నగర మహిళల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ జాయింట్ సీపీ రమేశ్, అదనపు సీపీ షికాగోయెల్, షీటీమ్ అదనపు డీసీపీ శిరీష ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాబ్‌కనెక్ట్ ద్వారా ఉద్యోగులు పొందిన నిరుద్యోగ యువతులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో ఉద్యోగాలు పొందడం ద్వారా నిరుద్యోగుల ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. చదవండి: టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు! ఆదర్శం నుంచి అధోగతికి! -
యువత చెంతకే ఉద్యోగాలు..
కంటోన్మెంట్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు, యువతతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యల్లో ‘జాబ్ కనెక్ట్’ ఒకటి. ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం నార్త్‌జోన్ పోలీసులు మెగా జాబ్ కనెక్ట్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ప్యాట్నీ సెంటర్లోని స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కార్ఖానా ఇన్స్పెక్టర్, జాబ్ మేళా ఇన్చార్జ్ వరవస్తు మధుకర్‌స్వామి గురువారం తెలిపారు. నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తర మండల డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వార్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ప్రవేశం, రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ తదితరాలన్నీ పూర్తిగా ఉచితం. టెన్త్ ఫెయిల్ అయిన వారి నుంచి ఐటీ ఉత్తీర్ణులైన వారి వరకు çప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు మొదలు ఐటీ ప్రొఫెషనల్ వరకు అన్ని రకాలైన ఉద్యోగాలకు ఇక్కడ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు స్వయంగా వచ్చి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎంపిక చేసుకున్న వారికి అక్కడికక్కడే జాయినింగ్ ఆర్డర్స్ అందజేస్తారు. వీరు ఆయా సంస్థల్లో కనిష్టంగా రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలవారు తమ బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాల జిరాక్స్ ప్రతులు, ఫొటోలతో హాజరుకావాలని మధుకర్‌స్వామి తెలిపారు. ప్రముఖ కంపెనీలు సైతం... యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలకు పలు ప్రతిష్టాత్మక కంపెనీలు, సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఈ జాబ్‌మేళాలో గూగుల్, అమెజాన్, నాగార్జున కన్‌స్టక్ష్రన్స్, కిమ్స్ ఆసుపత్రి, వింపటా ల్యాబ్స్, అపోలో ఫార్మసీ, ఫిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హైకేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, నవతా ట్రాన్స్పోర్ట్, పేరం గ్రూప్ఆఫ్ కంపెనీస్, ప్రీమియర్ హెల్త్ గ్రూప్, రిలయన్స్ డిజిటల్, బిగ్‌బజార్, శ్రీరామ్ లైఫ్ ఇన్సురెన్స్, శుభగృహæప్రాజెక్ట్, స్పెన్సర్స్, ఫార్చున్ మోటర్స్ సహా 75 సంస్థలు పాల్గొని యువతకు అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్‌మేళా ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సహాయ సహకారాల కోసం కార్ఖానా పోలీస్ సిబ్బంది ఫీబా (79011 21317), ప్రీతిలను (79011 21300) సంప్రదించాలి. సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే జాబ్ మేళా కోసం దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసారి 8500 మందికి ఉపాధి చూపాలని లక్ష్యంగా నిర్ణయించాం. –మధుకర్ స్వామి, కార్ఖానా ఇన్స్పెక్టర్ -
నిరుద్యోగులను జాబ్‌తో కనెక్ట్ చేస్తుంది
► నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపే మార్గం ► ప్రత్యేక వాహనం రూపొందించిన నగర పోలీసులు ► కమ్యూనిటీ పోలీసింగ్ చర్యల్లో భాగంగానే ► ప్రారంభించిన డీజీపీ సాక్షి, హైదరాబాద్ : ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు, సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం కోసం నగర పోలీసులు అమలు చేస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్‌లో మరో ముందడుగు పడింది. నిరుద్యోగులైన యువ తకు వారివారి ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగావ కాశాలు కల్పించడం కోసం సిటీ పోలీసులు ‘జాబ్ కనెక్ట్’పేరుతో ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. దీన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. ఏమిటీ వాహనం..? ప్రస్తుతం నగరంలోని బస్తీలు, కాలనీల్లో నిరుద్యోగ, అర్హతలకు తగిన ఉద్యోగాలు లేని యువత ఎందరో ఉన్నారు. వీరంతా ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం కూడా వీరికి గగనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం షెడ్యూల్ ప్రకారం నిత్యం కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులు, ఎలాంటి అండదండలు లేనివారు ఉంటున్న ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని వెళ్తుంది. ఎలా ఉపకరిస్తుంది? దీని నిర్వహణ కోసం నగర పోలీసు విభాగం టీఎంఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరు సిటీలోని రిటైల్ రంగంతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆయా ప్రాంతాల కు వెళ్లినప్పుడు అక్కడి యువత ఈ వాహ నంలో ఉన్న సిబ్బందిని సంప్రదించడం ద్వారా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తమ అర్హతలు, ఆసక్తుల్ని రిజిస్టర్ చేసుకోవ చ్చు. ఇలా రిజిస్టర్ అయిన వారికి అనువైన ఉద్యోగం ఉన్నట్లైతే ‘జాబ్ కనెక్ట్’సిబ్బంది ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం ఇచ్చి సమన్వ యం చేస్తారు. అవసరమైన వారికి ఇంటర్వ్యూ తదితరాల్లో శిక్షణ కూడా ఇస్తారు. అంతేకా కుండా... ‘జాబ్ కనెక్ట్’వ్యాన్‌కు అమర్చిన స్క్రీన్ ద్వారా ప్రజలకు అవసరమైన సూచ నలు, సలహాలను పోలీసులు అందిస్తుంటారు. మరోపక్క నగర పోలీసులు రూపొందించిన ‘హాక్–ఐ’యాప్ ద్వారానూ నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ‘చేయూత’స్ఫూర్తితో... నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి గత ఏడాది డిసెంబర్ 4న ‘చేయూత’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు సిబ్బందిని వారి పరిధుల్లో ఉన్న కాలనీలు, బస్తీలకు పంపడం ద్వారా మొత్తం 7,540 మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం టీఎంఐ సంస్థతో కలిసి 40 కంపెనీలతో భారీ జాబ్‌మేళా నిర్వహించి 1,300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో సీపీ మహేందర్‌రెడ్డి ఈ విధానం అన్ని ఠాణాల పరిధుల్లోనూ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాన్‌కు రూపమిచ్చారు. నిస్పృహకు లోనైతే ఇబ్బందే విద్యార్హతలు ఉన్న తర్వాత ఉద్యో గాలు రాకపోతే యువత నిస్పృహకు లోనవుతారు. అలాంటి వారే దారితప్పి నేరాలకు పాల్పడే ఆస్కారం ఉంది. అలా కాకుండా చేయడానికి ఇలాంటి చర్యలు చాలా కీలకం. నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’ను పరిచయం చేయడం శుభపరి ణామం. ఇది పోలీసింగ్లోనే కొత్త ఒరవడి. – అనురాగ్ శర్మ, డీజీపీ పరిచయాలు అవసరం లేకుండా కంపెనీలో తెలిసిన వారి అవసరం లేకుండా అర్హులైన యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగాల కల్పనలో దేశంలోనే మంచి పేరున్న టీఎంఐ సంస్థతో కలసి పని చేస్తున్నాం. ప్రధానంగా బస్తీలు, నిరుపేదలు నివసించే, వెనుకబడిన కాలనీలపై దృష్టి పెట్టనున్నాం. – ఎం.మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్ ఆ రెండిటికీ వారధిగా పనిచేస్తాం అనేక సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలను తెలుసుకోవడం, నిరుద్యోగులకు ఆ వివరాలు తెలిపి అర్హులైన వారి పొందేలా చేయడం... ఈ రెండిటికీ మధ్య మేము వారధిగా పనిచేస్తాం. ఈ వ్యాన్ ద్వారా ఉద్యోగాల కోసం తిరిగే అవకాశంలేని వారి ముంగిట్లోకి అవకాశాలను తీసుకువెళ్తాం. – మురళీధరన్, టీఎంఐ చైర్మన్