నిందితులను పట్టుకొచ్చిన బాధితులు
బాలానగర్ (హైదరాబాద్) : రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ రైల్వే ఉద్యోగిని, అతడి తమ్ముడిని బాలానగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావు అనే వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్లో టీటీఈగా పని చేస్తుంటాడు. శ్రీనివాసరావు తమ్ముడైన బాబూరావు హైదరాబాద్ బాలానగర్‌లోని సాయినగర్‌లో నివాసం ఉంటాడు. కాగా వీరిద్దరూ కూడబలుక్కుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు.
ఆ విధంగా తమ ప్రాంతంలోనే ఉండే అజయ్‌కుమార్ నుంచి రూ.రెండు లక్షలు గుంజారు. అశోక్, వెంకటేశ్వర్లు, పాపయ్య, కిరణ్ అనే మరో నలుగురు యువకులు కూడా వారికి రూ.8 లక్షలు ముట్టజెప్పారు. రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అనుమానించిన బాధితులు ఓసారి బాబూరావు, శ్రీనివాసరావులను నిలదీశారు. గత ఏడాది బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవల వారం రోజుల క్రితం బాబూరావు రాత్రికిరాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు నేరుగా విజయవాడ వెళ్లి శ్రీనివాసరావు, బాబూరావులను పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మోసం నిర్ధారణ అవడంతో ఇద్దరినీ మంగళవారం రిమాండ్‌కు తరలించారు.