ట్రంప్‌ను అడ్డుకోడానికి ఒక్కటైన క్రజ్, కాసిచ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ను నిలువరించేందుకు ఆయన ప్రత్యర్థులు టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రజ్, ఒహియో గవర్నర్ జాన్ కాసిచ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తాము వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు.
రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌కు అవసరమైన 1,237 మంది డెలిగేట్లను ట్రంప్ సాధించకుండా అడ్డుకునేందుకు ఎన్నికల్లో పరస్పరం పోటీ పడబోమని వీరిద్దరు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. తద్వారా జూలైలో జరిగే పార్టీ సమావేశంలో ట్రంప్‌తో పోటీపడి నామినేషన్ దక్కించుకోవాలన్నది వీరి ఆలోచన.