బీసీసీఐ చీఫ్ మరో ఘనత
న్యూఢిల్లీ: చిన్న వయసులో బీసీసీఐ చీఫ్ అయిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మరో ఘనత సాధించారు. మిలటరీ టెర్రిటోరియల్ ఆర్మీ (టీఏ)లో ఆయన రెగ్యులర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 41 ఏళ్ల ఠాకూర్ శుక్రవారం విధుల్లో చేరనున్నారు. తద్వారా మిలటరీ దళంలో చేరిన తొలి బీజేపీ ఎంపీ ఆయనే కానుండటం విశేషం.
చండీగఢ్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూ, పరీక్షలో ఆయన ఉత్తీర్ణులయ్యారు. టీఏలో చేరాక శిక్షణ పొందనున్నారు. ఓ ఏడాదిలో నెలరోజులు మిలటరీ శిక్షణ తీసుకున్నవారు టీఏలో వాలంటీర్లుగా పనిచేస్తారు. ఎమర్జెన్సీ పరిస్థితిలో వారు దేశం కోసం సైన్యంలో పనిచేస్తారు.
అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 'నాకు మిలటరీ యూనిఫాం ధరించాలని, దేశ భద్రతలో పాలుపంచుకోవాలన్నది ఎప్పటి నుంచో కల. ఈ కల నిజమైనందుకు నాకు చాలా ఉత్సుకతగా ఉంది' అని ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు.