ఓటుందో.. లేదో... చూసుకోండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో, లేదో ముందుగా పరిశీలించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని 9వ వార్డులో కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 9/1వ నంబరు బూత్‌లో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జాయింట్ కలెక్టర్ జె.మురళీ లేడీస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన 11వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలని, లేకుంటే ఎన్నికల సంఘానికి మెసేజ్ ద్వారా పంపినా మీ ఓటు ఉందో, లేదో తెలిసిపోతుందని తెలిపారు. ఒక వేళ ఓటు లేకుంటే సంబంధిత ఫారాలతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరచినా, సంబంధిత బీఎల్వోకు అందజేసినా ఓటు పొందవచ్చునన్నారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందా అని కలెక్టర్‌ను ప్రశ్నించగా... 1వ తేదీ మధ్యాహ్నం నాటికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంటుగా ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండాలా లేదా అని ప్రశ్నించగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి ఎవర్ని సూచిస్తే వారిని ఏజెంటుగా నియమించుకోవచ్చని చెప్పారు.
జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, అయితే నందిగామ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో లోటుపాట్ల వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఈ సంఘటనపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.