నిరుపేద దళిత కుటుంబాలకే భూ పంపిణీ
గోపాలపురం (నిడమనూరు) :భూమిలేని నిరుపేలైన దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రభుత్వం అందజేస్తుందని జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు ధర్మాపురం ఆవాసం గోపాలపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. భూమిలేకపోవడం వల్ల స్థిరం లేని మనుగడ సాగిస్తున్న దళితులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట, ప్రైవేటు భూముల అమ్మకంలో సహకరించాలని కోరారు. గోపాలపురంలో 25 మంది దళిత కుటుంబాలకు గాను 13మందిని మొదటి కేటగిరీలో, ఐదుగురిని రెండవ కేటగిరీలో, ఇద్దరిని మూడవ కేటగిరీలో అర్హులుగా నిర్ణయించారు. మొదటి కేటగిరీలో ఉన్న 13కుటుంబాలకు 39ఎకరాలు ఇవ్వా ల్సి ఉండగా అక్కడ ఎలాంటి ప్రభుత్వ భూమీ అందుబాటులో లేదు.
దీంతో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధర్మాపురం గ్రామానికి చెందిన చింతరెడ్డి సైదిరెడ్డి వారి కుటుంబసభ్యుల 15ఎకరాల భూమిని జేసీ ప్రీతీమీనా పరిశీలించారు. గ్రామానికి దూరంగా ఉన్న భూముల వద్దకు రాళ్లబాటలో నడిచి వెళ్లారు. భూముల వద్ద విక్రయదారులతో జేసీ, ఆర్డీవో కిషన్‌రావు చర్చలు జరిపారు. వారు ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇవ్వలేమని, కొంతసమయం ఇవ్వాలని కోరారు. కాగా, రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్డీఓను జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీపీ నర్సింహ, జెడ్పీటీసీ సభ్యురాలు అంకతిరుక్మిణి, మల్లయ్య పాల్గొన్నారు.