నా ఆదేశాలకే దిక్కులేదు: ఏపీ మంత్రి
- రెవెన్యూలో అలసత్వం పెచ్చుమీరిపోయింది
- జేసీల కాన్ఫరెన్సులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
- జిల్లాల్లో అర్జీలు ఏళ్ల తరబడి పెండింగ్
- హైకోర్టు నిర్ణయాలకూ విలువ ఇవ్వడంలేదు
హైదరాబాద్: రెవెన్యూ శాఖలో అలసత్వం పెచ్చుమీరుతోందని తన ఆదేశాలపై కూడా సక్రమంగా సమాధానాలు రావడంలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఏళ్ల తరబడి అర్జీలు పరిష్కారం కావడంలేదని, దీనిపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ల (జేసీల)తో మంగళవారం సచివాలయంలో జరిగిన కాన్ఫరెన్సులో కేఈ మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో తాము ఎన్ని సంస్కరణలు తెచ్చినా కొందరి అలసత్వం వల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మేము 700 ఎండార్స్మెంట్లు జిల్లాలకు పంపితే 51కి మాత్రమే జవాబులు వచ్చాయి.. వాటిని కూడా పరిష్కరించలేదని కేవలం లెటర్లు మాత్రమే పంపించారు. మేం పంపిన వాటికి కూడా ఏడాది దాటినా సమాధానం రాకపోతే ఎలా? ఒక స్వాతంత్య్ర సమరయోధుని భార్య విశాఖ జిల్లాలో 40 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఆమె ఎన్వోసీ కోసం దరఖాస్తు చేస్తే మన వాళ్లు అక్కడ చెట్లకు 40 ఏళ్లు లేవని రిపోర్టు ఇచ్చారు. ఆఫీసులో కూర్చుని రిపోర్టు ఇచ్చినట్లు ఉంది. చిత్తూరు జిల్లాలో వనజ అనే మహిళ.. భర్త, మామపై కేసు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె వస్తే నేను ఎండార్స్ చేయగా, దానికి రెండు నెలలుగా నాకు జవాబే లేదు. హైకోర్టు నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వడంలేదు.
రాత్రిళ్లూ ఫోన్లు వస్తున్నాయి.. దళారులవల్లే తహశీల్దార్లు ఎన్వోసీలు ఇవ్వడంలేదని మాకు ఫిర్యాదులు వస్తున్నాయని రిపోర్టు కూడా ఉంది. ఆర్డీవోలు, తహశీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏళ్లయినా అర్జీలు పరిష్కరించడంలేదు. కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండి అని అధికారులే కొందరికి చెబుతున్నారు. అనుకున్న ఫలితాలు రావడంలేదని ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కూడా చెప్పారు. దీనిని బట్టి జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతోంది. అలసత్వంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడవద్దు. కాగా, మీ ఇంటికి మీ భూమి ద్వారా రెవెన్యూ రికార్డులు అప్డేట్ అయ్యాయని సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేతా వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ సూచించారు. అర్బన్ ల్యాండ్ రికార్డులతో ఇంటిగ్రేషన్ పూర్తయితే మోసపూరిత, డ్యూయల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వే విభాగం కమిషనర్ వాణీమోహన్, తదితరలు పాల్గొన్నారు.