వివాదముంటే సర్కారు వద్దకే
- హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీల మధ్య వివాదం తలెత్తితే ప్రభుత్వాన్ని ఆశ్రయించండి
- స్పష్టం చేసిన ఉమ్మడి హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తమ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న లే ఔట్లకు సంబంధించి ఆయా పంచాయతీలు అందించే సేవల ఫీజులు, ఇతర చార్జీల విషయంలో హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)–గ్రామ పంచాయతీల మధ్య వివాదం తలెత్తితే ప్రభుత్వాన్ని ఆశ్రయించి పరిష్క రించుకోవాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఎండీఏతో వివాదం తలెత్తినప్పుడు దాన్ని వినతి రూపంలో పురపాలక శాఖ ముఖ్య కార్య దర్శికి 2 వారాల్లో సమర్పించాలని, ముఖ్య కార్యదర్శి ఆ వినతిపై 2 నెలల్లో నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
సోమవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలోని లే ఔట్లను అభివృద్ధి చేస్తూ భవన అనుమతులిస్తున్న హెచ్ఎండీఏ.. తద్వారా వచ్చే నిధుల్లో ఆయా గ్రామ పంచాయతీలకు వాటా ఇవ్వడం లేదని, దీని వల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతోందంటూ రంగారెడ్డి జిల్లా కొంపల్లి గ్రామ సర్పంచ్ జమ్మి నాగమణి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. పనులు చేయించుకుని, డబ్బులు ఇవ్వ బోమనడం సరికాదని వెల్లడించింది. ‘పంచాయతీ లకు ఇవ్వాల్సిన వాటా ఇస్తేనే కదా అవి అభివృద్ధి చెందేది’ అని వ్యాఖ్యానించింది.