డీఎస్సీ అభ్యర్థులకు ఆదిలోనే హంసపాదు
మొదటి రోజే ఓపెన్ కాని వెబ్సైట్
ఖాళీల వివరాల ప్రకటన ఎప్పుడో...
ఒంగోలు వన్‌టౌన్: టెట్, టీఆర్టీల ఉమ్మడి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. టెట్ కమ్ టీఆర్టీ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బుధవారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది. అయితే తొలిరోజు వారికి నిరాశే ఎదురైంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం ప్రకటించిన ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో డీఎస్సీ దరఖాస్తులు ఓపెన్ కాలేదు. దీంతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే గడువును ఒకరోజు కోల్పోయినట్లయింది.
ఖాళీల వివరాలేవీ...
ఉపాధ్యాయుల నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు చేసుకునేందుకు షెడ్యూలు ప్రకటించినా ఇప్పటి వరకు జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీలను ప్రభుత్వం ప్రకటించలేదు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా ఈ డీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1252 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిలో సెకండరీ గ్రేడు టీచర్లు 813, భాషా పండితులు 214, స్కూలు అసిస్టెంట్లు 184, వ్యాయామోపాధ్యాయులు 41 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఏ మున్సిపాలిటీకి, ఏ నగరపాలక సంస్థకు ఎన్ని పోస్టులు కేటాయించిందీ ఇంత వరకు వివరాల్లేవు.
డీఆర్ఆర్ఎంలో ప్రత్యేక కౌంటర్లు:
టెట్ కమ్ టీఆర్టీ -2014 (డీఎస్సీ-2014) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో బి.విజయభాస్కర్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు వేర్వేరుగా నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు బుధవారం నుంచి 2015 జనవరి 17వ తేదీ వరకు ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్లో దరఖాస్తుల్లో పొందుపరిచిన తర్వాత ప్రింట్ కాపీని తీసి తమ విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ, నేటివిటీ సర్టిఫికెట్లను గజిటెడ్ అధికారులతో అటెస్టేషన్ చేయించి దరఖాస్తులకు జతపరిచి కౌంటర్లలో అందజేయాలని డీఈవో తెలిపారు. ఆ వివరాలను డీఈఓ కార్యాలయం నుంచి ధ్రువీకరించిన తర్వాతే వారికి హాల్ టికెట్లు జారీ అవుతాయి.