ఆరోగ్య కార్యకర్తల్లా వచ్చి...
రియో డి జనిరో: జికా వైరస్ వ్యాప్తితో ఒక్కపక్క వణికిపోతుంటే మరోపక్క దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. జికా వైరస్ ను బూచిగా చూపి హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. జాయిన్ విల్లే నగరంలో ముగ్గురు వ్యక్తులు హెల్త్ వర్కర్లుగా నటించి ఓ ఇంట్లోకి అందినకాడికి దోచుకుపోయారు. సెక్యురిటీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.
ముగ్గురు దొంగల్లో ఇద్దరు బ్రెజిల్ సైనిక దుస్తులు, ఒకడు హెల్త్ ఇన్స్ పెక్టర్ మాదిరిగా తెల్లని కోటు ధరించాడు. తాము నగర ఆరోగ్యశాఖ అధికారులమని చెప్పి వారు ఇంట్లోకి చొరబడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. డబ్బు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని వారు ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బ్రెజిల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 220,000 సైనికులు, 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జికా వ్యాప్తికి కారణమవుతున్న ఎడిస్ ఈజిప్టై దోమ నివారణ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. హెల్త్ కార్యకర్తల పేరుతో వచ్చే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.