సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
జూకల్లో జాతీయ పోషణ వారోత్సవాలు
శంషాబాద్ రూరల్: సమతుల ఆహారంతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యమని ఆహార, పోషణ బోర్డు డెమాన్స్ట్రేషన్ అధికారి వి.నటరాజశేఖర్ తెలిపారు. జాతీయ పోషణ వారోత్సవాల సందర్భంగా మండలంలోని జూకల్లో గురువారం పోషకాహారంపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమతులంగా ఉన్నప్పుడే శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న తాజా కూరగాయలు, పప్పు దినుసులతో తక్కువ ఖర్చులోనే పోషకాహారం పొందవచ్చన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు తగు మోతాదులో పోషకాహారం తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆరోగ్యమే మహాభ్యాగం అనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. ప్రతి ఏటా సెప్టెంబరు 1 నుంచి 7 వరకు జాతీయ పోషణ వారోత్సవాలు నిర్వహిస్తూ పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పుట్టిన బిడ్డలకు వీలైనంత త్వరగా తల్లిపాలు అందించాలని, ఆరు నెలల వయస్సు తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అందించాలన్నారు. తాజా కూరగాయలు, పండ్లు, గుడ్లు ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఎక్కువ మోతాదులో పోషకాలు అందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీటీఎం రామేశ్వర్రావు, సర్పంచ్ అనిత, సీడీపీఓ నిర్మల, సూపర్వైజర్లు కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.