ఐఎస్ లో చేరిన ఎంపీ తనయుడు
అమ్మన్: తన కుమారుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడని జోర్డాన్ పార్లమెంట్ సభ్యుడొకరు బాంబు పేల్చారు. అంతేకాదు ఇరాక్ లో ఆత్మాహుతి దాడికి కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. 23 ఏళ్ల తన కుమారుడు మహ్మద్.. ఐఎస్ లో చేరాడని జోర్డాన్ ఎంపీ మాజెన్ దలాయిన్ తెలిపారు. ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న అతడిని జూన్ నెలలో చివరిసారిగా చూశామని అసోసియేటెడ్ ప్రెస్ తో చెప్పారు.
టర్కీ, సిరియా మీదుగా అతడు ఇరాక్ వెళ్లాడని వెల్లడించారు. అతడిని నిలువరించేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన వాపోయారు. తమ కుమారుడు మృతి చెందినట్టు శనివారం గుర్తించామని చెప్పారు. ఇరాకీ ఆర్మీ పోస్టుపై జరిగిన ఆత్మహుతి దాడిలో చనిపోయిన ముగ్గురు ఫొటోలను ఐఎస్ వెబ్ సైట్ లో పెట్టిందని, అందులో తమ కుమారుడు ఉన్నాడని మాజెన్ దలాయిన్ వివరించారు.