అధికారానికి మతాన్ని వాడుకోవద్దు
రాష్ట్రపతి ప్రణబ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను రాజేసిన బీఫ్ వివా దం నేపథ్యంలో.. విద్వేష ప్రసంగాలను, భయోత్పాతం సృష్టించటా న్ని అంతం చేయాలని.. కొందరు వ్యక్తుల అధికార దాహాన్ని తీర్చుకునేందుకు మతాన్ని ముసుగుగా వాడుకోరాదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. ఈ నెల పదో తేదీ నుంచి జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో చరిత్రాత్మక పర్యటనకు వెళ్లనున్న ప్రణబ్ గురువారం జోర్డాన్ టైమ్స్, అల్ ఘాద్ పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘సహనం, సహజీవనం మన నాగరికత మూలసూత్రాలు. మన విలువలు మన దైనందిన జీవితంలో భాగంగా మారాలి. మనం సంయమన గళాన్ని పెంపొందించాలి’’ అని అన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడ్డ ఉగ్రవాదులు అనే తేడా చూపుతూ కొన్ని దేశాలు అనుసరిస్తున్న చీలికల, పక్షపాతవిధానం విఫలమైందన్నారు.
ఉగ్రవాదమనే విపత్తును సమగ్రమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారంతోనే తిప్పికొట్టగలమన్నారు. మధ్య ప్రాచ్యంలో అస్థిరత కారణంగా ప్రపంచంలో ఉగ్రవాదం పెరుగుతుండటంపై భారత్ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాద సవాలును ఎదుర్కొనేందుకు భారత్ సమగ్ర విధానాన్ని అవలంబిస్తోందన్నారు. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొంటోం దన్న జోర్డాన్ రాజు అబ్దుల్లా వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానంటూ.. దానిని అంతే తీవ్రతతో ఎదుర్కోవటం తప్పనిసరి అని అన్నారు.