ఇందూరులో ‘అల్లు’ సందడి
నిజామాబాద్ బిజినెస్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌రోడ్డులో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన జోయాలుక్కాస్ వరల్డ్స్ ఫెవరేట్ జ్యువెలర్ షోరూంను బుధవారం సినీ హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకున్న అల్లు ఉదయం కొద్దిసేపు వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఫ్రెషప్ అయ్యారు. అనంతరం రోడ్డు కిరువైపులా కిక్కిరిసిన అభిమానులకు అభివాదం చేస్తూ షోరూంకు వెళ్లి ప్రారంభించారు. షోరూంలో జ్యోతి ప్రజ్వల న చేశారు. కొత్త మోడల్ ఆభరణాలను తిలకించారు. హైదరాబాద్‌రోడ్డులో ఇప్పటి కే బ్రాండెడ్ కంపెనీ వస్త్రాలయాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, కళానికేతన్, ఆకృ తి, తదితర ప్రముఖ వ్యాపార షోరూంలు వెలిశాయి. జోయాలుక్కాస్ జ్యువె లర్ షోరూంతో ఈ రోడ్డును కొత్తశోభను సంతరించుకుంది.
కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌పవార్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోటూరి దయానంద్‌గుప్తా, భక్తవత్సలం నాయుడు, మీసాల సుధాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు పాల్గొన్నారు. షోరూం ప్రారంభం అనంతరం అల్లు మాట్లాడుతూ ఇందూరు ప్రజలను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. తన కోసం ఉదయం నుంచి టిఫిన్లు కూడా చేయకుం డా ఎండలో నిలబడ్డ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాల విషయానికివస్తే తాను రేసుగుర్రం చిత్రంలో కనబడుతానని తెలిపారు.
బందోబస్తు విఫలం
నిజామాబాద్ క్రైం : అల్లు అర్జున్ రాక నేపథ్యంలో బందోబస్తు నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి నుంచి వచ్చిన అల్లు అర్జున్ అభిమాని ఎండీ కాసీఫ్ జునైద్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. తన అభిమాన హీరోను చూసేందుకు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ కంచెపైకి ఎక్కిన కాసీఫ్ ప్రమాదానికి గురయ్యాడు.