జాషువా పీఠం ఏర్పాటు చేయాలి
- గుర్రం జాషువా 120వ జయంతి సభలో జేడీ శీలం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ)లో గుర్రం జాషువా పీఠం ఏర్పాటు చేయాలని ఎంపీ జేడీ శీలం కోరారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని చెప్పారు. జాషువా పీఠం ఏర్పాటుకు తన ఎంపీ కోటా నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఆదివారం మహాకవి గుర్రం జాషువా 120వ జయంతి ఉత్సవసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జాషువా తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపారని చెప్పారు.
దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచం గర్వించదగ్గ బౌద్ధ సంస్కృతికి నెలవైన అమరావతి విదేశీయులు నిర్మించే వ్యాపార కేంద్రంగా మారకూడదని చెప్పారు. ధనవంతులకే పరిమితమై పేద, ధనిక అంతరాలను మరింతగా పెంచే వాణిజ్య రాజధాని తెలుగు ప్రజలకు అవసరం లేదని, అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి సంతోషంగా జీవించే ప్రజా రాజధాని కావాలని చెప్పారు. గుంటూరు జిల్లాలోని భూముల్లో 90 శాతం సీఎం చంద్రబాబునాయుడు వర్గానికి చెందిన అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయన్నారు. ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ అట్టడుగు వర్గాల జీవిత వ్యథలను తన రచనల్లో చొప్పించిన గుర్రం జాషువా ఎప్పటికీ అమరుడేనని చెప్పారు.