స్వైన్‌ఫ్లూతో సీనియర్ పాత్రికేయుడి మృతి
సాక్షి, ముంబై: స్వైన్‌ఫ్లూ వ్యాధితో సీనియర్ పాత్రికేయుడు రమేశ్ రావుత్(52) శుక్రవారం మరణించారు. గత వారం రోజులుగా రావుత్ జ్వరంతో బాధపడుతుండటంతో డాక్టర్ హెడ్గేవార్ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని పరీక్షలు నిర్వహించగా ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకినట్టు గురువారం నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఔరంగబాద్‌లోని ఘాటి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన భార్య మాధురి కూడా జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను కూడా అదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
20 ఏళ్లకుపైగా పాత్రికేయ వృత్తిలో..
రమేష్ రావుత్ గత 20 ఏళ్లకుపైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఔరంగాబాద్‌లోని అనేక దినపత్రికలలో ఆయన విధులు నిర్వహించారు. పాత్రికేయుడి నుంచి సంపాదకుడి వరకు అన్ని బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా ‘చిత్రలేఖ’ అనే వారపత్రికకు అనే క ఏళ్లు మరాఠ్వాడా ప్రతినిధిగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన రాసిన పలు ఆర్టికల్స్ చర్చల్లోకెక్కాయి.
ముంబైలోని సామ్నా దినపత్రికలో కూడా విధులు నిర్వహించడంతో శివసేన, ఎమ్మెన్నెస్ అధ్యక్షులైన ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కుటుంబీకులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఔరంగాబాద్‌తోపాటు మరాఠ్వాడాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హఠాన్మరణంపై పాత్రికేయ మిత్రులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.