ఆర్డినెన్స్ తెచ్చాక ఎంత భూమిని సేకరించారు?
జేపీసీలో సర్కారును ఇరుకున పెడుతూ ప్రతిపక్షం డిమాండ్
న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ప్రతిపక్షం.. ఇప్పుడు సర్కారును మరింత ఇరుకున పెడుతోంది. తొలిసారి గత డిసెంబర్లో భూసేకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసినప్పటి నుండీ.. దాని కింద వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను అందించాలని సర్కారును డిమాండ్ చేసింది.
బీజేపీ ఎంపీ ఎస్.ఎస్.అహ్లూవాలియా అధ్యక్షతన జరిగిన జేపీసీ తొలి భేటీలో.. కాంగ్రెస్ నేత జైరాంరమేశ్, బీజేడీ ఎంపీ బి.మహతాబ్లతో పాటు.. టీఎంసీ, వామపక్షాల సభ్యులు.. యూపీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి, ఆర్డినెన్స్‌ను జారీ చేయటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
జాతీయ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిమిత్తం ఈ మార్పులు చేయటం అనివార్యమన్న ప్రభుత్వ వాదనను తిప్పికొట్టేందుకు.. ఈ ఆర్డినెన్స్ తెచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం ఆమోదించిన జాతీయ భద్రతా ప్రాజెక్టుల వివరాలేమిటో జేపీసీ ముందుకు పెట్టాలని జైరాం కోరారు.