ఒక్క ఫించను తగ్గినా సహించం
సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు
చిత్తూరు(ఎడ్యుకేషన్): పింఛన్లుదారుల్ని తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తోందని, ఒక్క పింఛను తగ్గినా టీడీపీ ఎంఎల్ఏ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులను నిలదీస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ కార్డు అవసరం లేదన్న చంద్రబాబు, అధికారంలోకి రాగానే ప్రతి దానికి ఆధార్‌కార్డు అవసరమని చెప్పడం సరికాదన్నారు. కొత్త పింఛన్లు ఇవ్వాలిగానీ, పాత వాటి ని ఎత్తేసేందుకు సర్వేలు చేయడం దారుణమని, ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. బాబు అధికారంలోకి వచ్చి వంద రోజులైందని పండుగ చేసుకుంటున్నారని, ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు.
రుణమా ఫీ విషయంలో మాట తప్పారని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉ ద్యోగాలు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, సహకరించని అధికారులను బదిలీ చేయిస్తామంటూ బెదిస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతల ఆక్రమణల గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే విచారణ చేయిస్తామని చెప్పి పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంటరత్నం మాట్లాడుతూ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకోవడం చంద్రబాబు పాలసీ అని, అందుకే మెగాసిటీ, ఆ సిటీ అని భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
29న భూపోరాట సదస్సు..
టీడీపీ నేతల ఆక్రమణల గురించి ఈనెల 29వ తేదీన భూ పోరాట సదస్సులో బయటపెడతామని రామానాయుడు తెలిపారు. శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణ మండపంలో సదస్సు జరుగుతుందని, దీనికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కే.నారాయణ వస్తారని చెప్పారు. సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు, మేధావులు సదస్సుకు తరలిరావాలని కోరారు. సమావేశంలో నేతలు నాగరాజన్, జయలక్ష్మి, మణి, ఆర్ముగంరెడ్డి పాల్గొన్నారు.