సామాజిక బాధ్యతతో పనిచేయాలి
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భవానిచంద్ర
తిమ్మాపూర్: ప్రతీ వ్యక్తి సమాజంలో చెడును దూరం చేయడానికి సామాజిక బాధ్యతతో పనిచేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, జడ్జి జి.భవాని చంద్ర సూచించారు. మండలంలోని అల్గునూర్ గ్రామ పంచాయతీలో న్యాయ సేవా సదస్సును శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యువత చెడువైపు వెళ్లడంతో కేసులు చాలా వస్తున్నాయని, ఇవన్నీ సమాజంపైనే ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు. పేదరికంతో ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. పిల్లల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. పిల్లలతో వాహనాలు నడిపించవద్దని తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సినిమా, టీవీల ప్రభావం పిల్లలపై పడుతుందన్నారు. చెడుతో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. చిన్నచిన్న కేసుల విషయంలో రాజీమార్గాలు చూసుకోవాలని తెలిపారు. ప్రతీ వ్యక్తి బాగుండాలని, పక్కవారు బాగుండేలా చూడాలని ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. చట్ట ప్రకారం భూములు రిజిష్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసుకోవాలని, ప్రామిసరీనోటు ద్వారా అప్పులు ఇవ్వాలని, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టవద్దని సూచించారు. అల్గునూర్లో పలువురు భూసమస్యలు సృష్టిస్తున్నారని జడ్జికి స్థానికులు ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ సింగిరెడ్డి స్వామిరెడ్డి, న్యాయ సలహాదారు వెంకటరమణయ్య పాల్గొన్నారు.