70 ఏళ్ల నాటి భవనం కూల్చివేత కేసును కొట్టేసిన కోర్టు
న్యూఢిల్లీ : 70 ఏళ్ల నాటి తన ఆస్తిని ధ్వంసం చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నష్టపరిహారం కోరుతూ ఢిల్లీకి చెందిన రఘుబిర్ సరన్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి కొట్టేశారు. అతిపురాతనమైవి, ప్రమాదపు అంచుల్లో ఉన్న కట్టడాలను చట్టపరంగా కూల్చివేసి రక్షణ కల్పించడం ఎమ్సీడీ బాధత్యని అడిషినల్ జిల్లా జడ్జి జస్టిస్ కమినీ లౌ చెప్పారు. అందువల్ల పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఉత్తర ఢిల్లీకి చెందిన రఘుబీర్ సరన్కు చెందిన 1947 సంవత్సరం నాటి పాత భవనంలో కొంత భాగాన్ని 2007లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చి వేసింది.
దీంతో భవనం యజమాని తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గోడ కూలకముందే ఎమ్సీడీ కూల్చేసిందని పిటిషనర్ వ్యాఖ్యానించారు. దీనికి కోర్టు స్పందిస్తూ గోడ కూలిపోయి ప్రమాదం జరిగేంత వరకు ఎవరూ వేచి ఉండరని.. ఎమ్సీడీ తన చట్టబద్ధమైన బాధ్యతను నిర్వర్తించిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ గోడ దానంతట అదే కూలిపోతే అప్పుడు ఎవరికీ హాని జరగదన్న భరోసా ఏంటని ప్రశ్నించింది.