ఇక కొత్తగా ‘జునకా-భాకర్’
- కేంద్రాలను ఆధునీకరించాలని యోచిస్తున్న యజమానులు
- అనుమతికోసం ప్రభుత్వానికి విన్నపం
- ఫోన్లో ఆర్డర్లు.. హోం డెలివరీ
సాక్షి, ముంబై: నగరంలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ‘జునకా-భాకర్’ (జొన్నరొట్టె-సంకటి) విక్రయ కేంద్రాల యజమానులు సిద్ధమవుతున్నారు. ఫోన్లో ఆర్డర్లు తీసుకొని డెలివ రీ చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,500 జునకా-భాకర్ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.
ముంబైలో ప్రస్తుతం మెక్ డొనాల్డ్, డొమినోజ్, కెఫే కాఫీ డే, బరిస్తా లాంటి విదేశీ సంస్థలు పెద్ద మొత్తంలో వ్యాపారం సాగిస్తున్నాయని, వీటికి ధీటుగా జునకా-భాకర్ కేంద్రాల వ్యాపారం పెంచాల్సిన అవసరం ఉందని యూనియన్ అధ్యక్షుడు ఉమేశ్ వాఘ్లే అన్నారు. కేంద్రాలలో ఐస్క్రీం, కాఫీ, మిఠాయి తదితర తినుబండరాలు విక్రయించేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. స్టాళ్లు యజమానుల పేరిట లేకపోవడంతో ఆర్థిక సాయం అందించేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదని, దీంతో వాటిని ఆధునీకరించే వీలు లేకుండాపోయిందని ఆయన అన్నారు.
18 ఏళ్ల కిందట ప్రారంభం
నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 18 ఏళ్ల కిందట అప్పటి బీజేపీ, శివసేన ప్రభుత్వం జునకా-భాకర్ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలం మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సమకూర్చి ఇచ్చింది. అందుకు బీఎంసీ నామ మాత్రపు అద్దె వసూలు చేసేది. పేదలకోసం ఏర్పాటుచేసిన కేంద్రంలో రూపాయికే జొన్న రొట్టె, సంకటి విక్రయించాలని షరతు విధించింది. జునకా, భాకర్ మినహా వడాపావ్, మిసల్ పావ్, దోశ, ఉతప్ప లాంటి తినుబండారాలు విక్రయించకూడదని ఆంక్షలు విధించింది.
కేవలం జునకా, భాకర్ విక్రయించడం వల్ల ఆదాయం రాకపోవడంతో స్టాళ్లపై యజమానులకు ఆసక్తి తగ్గింది. తర్వాత ప్రభుత్వాలు మారడంతో కేంద్రాలను మూసివేశారు. అయితే రాష్ట్రంలో మరోసారి బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రావడంతో ‘జునకా-భాకర్’ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్రాలను పాత పద్ధతిలో కాకుండా, విదేశీ కంపెనీలకు పోటీగా ఆధునిక పద్ధతిలో నిర్వహించాలని, ఫోన్లో ఆర్డర్లు తీసుకొని డెలివ రీ చేయాలని యజమానులు యోచిస్తున్నారు.