ఆఫ్రికన్లపై దాడులను ఖండించిన సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల ఆఫ్రికన్ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్లను ఆదివారం సుష్మా స్వరాజ్ కోరారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబీకులకు అన్ని రకాలుగా సహకరిస్తామని ఆమె వెల్లడించారు.
అలాగే బుధవారం హైదరాబాద్‌లో పార్కింగ్ వివాదంలో నైజీరియన్ విద్యార్థులపై దాడికి సంబంధించిన కూడా సుష్మా స్వరాజ్ తక్షణమే నివేదికను కోరారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. ఆఫ్రికన్లపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఆమె కోరారు. తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టదలచిన విద్యార్థులతో మాట్లాడాలని జనరల్ వీకే సింగ్, సహాయ కార్యదర్శి అమర్ సిన్హాలను కోరినట్లు సుష్మా స్వరాజ్ వెల్లడించారు.