జూనియర్ ప్రపంచకప్ హాకీ విజేత భారత్
లక్నో: జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మరోసారి చరిత్ర సృష్టించారు. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్ను సాధించిన భారత్.. నేటితో ఆ కరువును తీర్చుకుంది. ఇక్కడి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్ నిలబెట్టుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించినా.. చివరి మెట్టుపై బెల్జియంను భారత్ బోల్తా కొట్టించింది.
ఆది నుంచి భారత కుర్రాళ్లదే హవా!
ఆట మొదలైన 8వ నిమిషంలో గుర్జంత్ సింగ్ బెల్జియం గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ భారత్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ మరుసటి నిమిషంలో నీలకంఠశర్మ గోల్ పోస్ట్ కు బంతిని కొట్టగా తృటిలో గోల్ చేజారింది. 22వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్, నీలకంఠ సమిష్టిగా గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు. ఆటముగిసే సరికి బెల్జియం కేవలం ఒక్క గోల్ చేయడంతో 2-1తో భారత్ రెండో పర్యాయం జూనియర్ హాకీ ప్రపంచ కప్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ తర్వాత రెండుసార్లు ఈ ప్రపంచ కప్ నెగ్గిన జట్టుగా భారత్ ఘనత వహించింది.