Justice B Siva Sankara Rao
-
ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో టెండర్లు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో 104, 108, ఈఆర్సీ (ఆపరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స్)ల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఉంచినట్లు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ జ్యుడీషియల్ ప్రివ్యూ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ ప్రివ్యూ ‘లోగో’ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బాధ్యత గల పౌరులుగా ప్రజలు, కాంట్రాక్టర్లు, నిష్ణాతులు.. టెండర్లపై తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేయనున్న 200 రిగ్గుల యంత్రాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పరిశీలించి, అందులోని లోపాలను సవరించాలని చెప్పామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు వీలుగా రూ.600 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని, ఆ టెండరును పరిశీలించి లోపాలను సవరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. తర్వాత వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. గాలేరు నగరి – సుజల స్రవంతి పనులకు సంబంధించిన టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వచ్చిందని, దానిని పరిశీలించాల్సి ఉందన్నారు. -
జ్యుడీషియల్ ప్రివ్యూకు చకచకా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతిరహితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటైన ‘న్యాయపరమైన ముందస్తు సమీక్ష’కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీ మౌలిక సదుపాయాల(న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టాన్ని రాష్ట్రసర్కారు తీసుకురావడం, టెండర్ల న్యాయ పరిశీలన బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు అప్పగిస్తూ ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జికి అవసరమైన సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణుల జాబితాలను సంబంధిత శాఖలన్నీ తక్షణం పంపించాలని ఆదేశించారు. ఆ జాబితాల్లోని వారి గత రికార్డుపై విజిలెన్స్ నివేదికల్ని తీసుకోవడంతోపాటు ఎటువంటి మచ్చలేని వారితోనే జాబితాలను పంపాలన్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు లేదా స్థానిక అధికారి రూ.100 కోట్లు.. అంతకుమించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ ప్రక్రియకు వెళ్లేముందు ఆయా పత్రాలన్నింటినీ న్యాయపరమైన సమీక్షకోసం ముందుగా న్యాయమూర్తికి సమర్పించాలని సంబంధిత శాఖలకు నిర్దేశించారు. ఒకసారి జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన చేశాక సంబంధిత టెండర్ ప్రక్రియలో ప్రీబిడ్ నెగోషియేషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపాక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండబోవన్నారు. ‘స్పందన’కు ప్రామాణిక విధానాన్ని పాటించాలి ‘స్పందన’ కార్యక్రమం కింద వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు అన్ని శాఖలూ ఒకే ప్రామాణిక విధానాన్ని(స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్) పాటించాలని సీఎస్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ‘స్పందన’పై వర్క్‌షాప్ జరిగింది. ప్రజలనుంచి వచ్చే ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంలో అనుసరించాల్సిన ‘స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్’పై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచనలిచ్చారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి నిర్దిష్ట కాలవ్యవధి పెట్టి ఆ గడువులోగా సదరు ఫిర్యాదును పరిష్కరించడంతోపాటు ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఆ వివరాల్ని ప్రణాళికా శాఖకు అందించాలని సూచించారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి శాఖలవారీగా రూపొందించిన కాలవ్యవధి(టైమ్ లైన్), స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ వివరాల్నీ అందించాలన్నారు. వచ్చే ప్రతి ఫిర్యాదును సకాలంలో సక్రమంగా పరిష్కరించడంపై అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి ఫిర్యాదు ఆమోదానికి ముందు.. లబ్ధిదారు ఎంపిక అనంతరం సోషల్ ఆడిట్ తప్పనిసరన్నారు. -
జస్టిస్ శివశంకరరావు బాధ్యతల స్వీకరణ
సాక్షి; అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు అన్నారు. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా శనివారం సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చి, దీన్ని అమలు చేయడానికి ఒక న్యాయమూర్తిని నియమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. విదేశాల్లో కూడా ఈ తరహా విధానం ఎక్కడా లేదని వెల్లడించారు. లోకకళ్యాణం కోసం మనమంతా జీవించాలని, ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. హక్కుల కోసం పోరాడేవారు బాధ్యతగా ఉండాలని.. కర్మబద్దంగా.. ధర్మబద్దంగా అందరూ పని చేయాలని ఆయన అన్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జస్టిస్ శివశంకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌ను కలిసిన లక్ష్మణ్‌రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. -
టెండర్ల న్యాయపరిశీలన బాధ్యతలు జస్టిస్ శివశంకర్‌రావుకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించేందుకు ఇటీవల ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా బుధవారం కీలక నియామకాన్ని చేపట్టింది. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతలను తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు అప్పగించింది. అమలాపు రానికి చెందిన ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఈ మేరకు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ప్రమాణ స్వీకారం రోజే మాటిచ్చిన ముఖ్యమంత్రి.. గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏమాత్రం పారదర్శకత లేకుండా రూ.వందల కోట్ల విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టింది. దీనికి అడ్డుకట్ట వేసి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. టెండర్లను మొదలు పెట్టడానికి ముందే ఆ ప్రక్రియను పరిశీలించేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చింది. రూ.100 కోట్లు దాటిన టెండర్లన్నీ న్యాయ పరిశీలనకే... కొత్త చట్టం రాకతో ఇకపై వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు. న్యాయ పరిశీలన అనంతరం వచ్చే సూచనల ప్రకారం ఆ టెండర్‌పై నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ వనరులను సమర్థంగా, అనుకూలమైన విధానంలో ఉపయోగించడంలో భాగంగా రివర్స్ టెండరింగ్ కూడా నిర్వహిస్తారు. ఏ ఒక్కరికో పనులు కట్టబెట్టకుండా అర్హత కలిగిన వారందరికీ సమాన అవకాశాలు కల్పించడం కూడా ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చింది. ఏసీజేతో చర్చించిన ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ బాధ్యతలను న్యాయ పరిశీలనకు అప్పగించే విషయంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. న్యాయ పరిశీలన బాధ్యతలను చేపట్టేందుకు విశ్రాంత న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాలని ఏసీజేను కోరింది. ఈ నేపథ్యంలో ఆయన సిఫారసు మేరకు ఈ బాధ్యతలను జస్టిస్ శివశంకరరావుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ శివశంకరరావు నేపథ్యం.. జస్టిస్ శివశంకరరావు 1959 మార్చి 29వతేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం సకుర్రు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి గవర్రాజు మాజీ సర్పంచ్. జస్టిస్ శివశంకరరావు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పాలగుమ్మి సూర్యారావు, దువ్వూరి మార్కండేయుల వద్ద జూనియర్‌గా పని చేశారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చారు. పలు సంచలన తీర్పులిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆయన పదవీ విరమణ చేశారు. దర్మబద్ధంగా బాధ్యతలు నిర్వర్తిసా ‘‘ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలను అప్పగించింది. ధర్మబద్ధంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తా. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. నాకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తా. అవినీతి రహిత సమాజం కోసం నావంతు కృషి చేస్తా’’ – జస్టిస్ శివశంకరరావు