గగన్ ఖోడా దిగిపోవాల్సిందేనా!
లోథా కమిటీ సిఫారసుల ప్రభావం
తృటిలో బయటపడిన ఎంఎస్కే
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఇప్పుడు జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీపై పడింది. సెంట్రల్ జోన్ సెలెక్టర్‌గా పని చేస్తున్న గగన్ ఖోడా... తన పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుత కమిటీలో సందీప్ పాటిల్ చైర్మన్‌గా, విక్రమ్ రాథోర్, సాబా కరీమ్, ఖోడా, ఎం.ఎస్.కే ప్రసాద్‌లు సెలెక్టర్లుగా పని చేస్తున్నారు. అయితే ఇందులో పాటిల్, రాథోర్, కరీమ్‌ల నాలుగేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. కానీ అక్టోబర్ 2015లో బాధ్యతలు చేపట్టిన ఖోడా, ప్రసాద్ (సౌత్‌జోన్)ల భవిష్యత్పైనే ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. పాత నిబంధనల ప్రకారం ఈ ఇద్దరూ 2019 వరకు పదవిలో కొనసాగడానికి అవకాశం ఉంది. అయితే లోథా కమిటీ ప్రతిపాదనల ప్రకారం... టెస్టులు ఆడిన మాజీ ఆటగాళ్లు మాత్రమే సెలెక్షన్ కమిటీలో ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం రెండు వన్డేలు మాత్రమే ఆడిన ఖోడా... కెరీర్లో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. దీంతో తొలి వేటు ఇతనిపైనే పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఆరు టెస్టులు, 17 వన్డేలు ఆడిన ప్రసాద్ మాత్రం తృటిలో తప్పించుకున్నారు.
ఖోడాను ఓ ఆరు నెలల పాటు పదవిలో కొనసాగించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సెలెక్షన్ కమిటీ (ముగ్గురు సభ్యులు మాత్రమే) పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించే వరకు అతను ఉండటం చాలా అవసరమని బోర్డు భావిస్తోంది. మరోవైపు ఆగస్టు 5న జరగనున్న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం వేదిక ముంబై నుంచి ఢిల్లీకి మారింది.