న్యాయ వ్యవస్థకే అవమానకరం
జస్టిస్ రూపన్వాల్ ప్రకటనపై నారాయణ
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల దళితు డు కాదని జస్టిస్ రూపన్వాల్ ప్రకటించడం న్యాయ వ్యవస్థకే అవమానకరమని సీపీఐ నేత కె.నారాయణ మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులపై విచారణ చేయమని కేంద్రం ఆదేశిస్తే.. అతను దళితుడు కాదని కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషనర్ విచారణాంశాలలో రోహిత్ ఏ కులం వాడో విచారించమని పేర్కొనలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీలోని వ్యవస్థీకృత హింస వల్లనే రోహిత్ ప్రాణం కోల్పోయాడన్నారు.
రోహిత్ దళితుడేనని గతంలో గుంటూరు కలెక్టర్ నివేదిక ఇచ్చారని, ఎమ్మార్వో కుల ధృవీకరణ సర్టిఫికెట్ జారీ చేశారని, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా రోహిత్ దళితుడేనని తెలిపిందన్నారు. మరి ఇప్పుడు రూపన్వాల్ చెప్పింది నిజమైతే గుంటూరు జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రూపన్వాలా నివేదికను చెత్తబుట్టలో వేయాలని నారాయణ డిమాండ్ చేశారు.