‘షా’ నివేదికను మాకివ్వండి: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ఒడిశా, జార్ఖండ్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ షా కమిషన్ నివేదికను జనవరి 27లోగా తమకు అందించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర సాధికార కమిటీకి కూడా నివేదిక ప్రతిని ఇవ్వాలని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని హరిత ధర్మాసనం పేర్కొంది.
వార్తాపత్రికల్లో ప్రచురితమైన షా కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు దిగ్భ్రాంతి గొలిపేలా ఉన్నాయని, వాటిపై అత్యున్నత న్యాయస్థానం సమీక్ష జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనాన్ని కోరారు. షా కమిషన్ గడువును మరో ఏడాది పెంచాలని కేంద్రాన్ని ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై జనవరి 27న వాదనలు వింటామని బెంచ్ తెలి పింది. మైనింగ్ వ్యాపారంలో ఉన్న పెద్దల ప్రయోజనాలకు విఘా తం కలుగుతుందనే షా కమిషన్ గడువును పెంచడం లేదని గోవా ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ తన పిటిషన్లో ఆరోపించింది.