వైభవం.. గరుడోత్సవం
– ధ్వజారోహనము తో ముగిసిన
ఎగువ అహోబిల బ్రహ్మోత్సవం
– ఆకట్టుకున్న స్వామి బావమరుదుల(చెంచుల)
ఆటపట్టించే కార్యక్రమాలు
అహోబిలం(ఆళ్లగడ్డ) అహోబిల బ్రహ్మోత్సవాల చివరి రోజు ఆదివారం అర్ధరాత్రి ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలనరసింహస్వామి గరుడోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం రాత్రి నిత్యపూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన స్వామిని అర్ధరాత్రి అనంతరం విశేష పూలాంకరణ గావించిన గరుడ వాహనము పై కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గరుడ మహోత్సవ వేడుకలు సోమవారం తెల్లవారు జామున వరకు సాగాయి. అంతకు ముందు ఉదయం ఉత్సవం, సాయంత్రం ద్వాదశారథనం నిర్వహించిన అనంతరం రాత్రి గరుడోత్సవం నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఎగువ అహోబిలం బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ధ్వజావరోహనము చేపట్టారు.
ఆకట్టుకున్న స్వామిని ఆటపట్టించే కార్యక్రమాలు
చెంచులక్ష్మీ అమ్మవారిని శ్రీ జ్వాలనరసింహస్వామి పరిణయమాడటంతో వరుసకు బావగా భావించే చెంచులు నూతన పెండ్లి కొడుకైన స్వామిని సంప్రదాయంగా ఆటపట్టించారు. ఇందులో భాగంగా గరుడవాహనము పై ఆశీనులైన స్వామి మేలిమి ఆభరణాలు ఎత్తుకెళ్లి దాచడం, అర్చకులను ఆటపట్టించడం, వారిని ఎత్తుకెళ్లడం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.