చార్మి సమర్పణలో...
గత కొన్ని నెలలుగా చార్మి కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తున్నారు. ఇదంతా బరువు తగ్గడానికే. ఏ హీరో ,హీరోయిన్ అయినా ఇలా బరువు తగ్గితే కచ్చితంగా ఏదైనా పాత్ర కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చార్మి బరువు తగ్గింది ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం కోసం. ఈ మధ్య ‘టెంపర్’ ఆడియో వేడుకలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మని చూసి, చక్కనమ్మ చిక్కినా అందమే అనుకున్నారు. ఈ నెల 20న జ్యోతిలక్ష్మి పాత్రలోకి చార్మి ఒదిగిపోనున్నారు.
ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? పూరి జగన్నాథ్. 20న ఈ షూటింగ్ ప్రారంభించి, నిర్విరామంగా జరుపుతామనీ, ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అని పూరీ తెలిపారు. ఈ చిత్రంలో నటించడంతో పాటు సమర్పకురాలిగా కూడా చార్మి వ్యవహరించనుండటం విశేషం. శ్వేతలానా, వరుణ్-తేజ, సీవీ రావు నిర్మించనున్న ఈ చిత్రంలో సత్య, వంశీ కీలక పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: పీజీ విందా.