సభ్యత్వం తీసుకుంటేనే పథకాలు
♦ ప్రకటనల కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నాం
♦ కార్మికుల వద్ద డబ్బులు తీసుకుంటే సస్పెండ్ చేయిస్తా
♦ కార్మిక శాఖ మంత్రి నాయిని
హైదరాబాద్: కార్మికశాఖలో ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం 12వ వార్షికోత్స వం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయిని మాట్లాడుతూ కార్మిక శాఖ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కార్మికులకు తెలిసేందుకు ప్రకటనల రూపంలో రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. కార్మికుల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతున్నామని.. తమ పిల్లల్ని బాగా చదివించాలని అన్నారు. కార్మికులు తీసుకునే సభ్యత్వంలోని నయాపైసా వృథా కాదని ఆయన హామీ ఇచ్చారు.
ఎవరన్నా కార్మికులను డ బ్బులు అడిగితే తనకు చెబితే వెంటనే వారిని సస్పెండ్ చేయిస్తానని అన్నారు. కార్మికుడు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తున్నామని అనగానే... తమ దగ్గర చనిపోతే డబ్బులు ఇవ్వటం లేదని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన నాయిని వెంటనే అందరికీ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న సంఘాలన్నీ ఒక ఫెడరేషన్‌గా ఏర్పడితే స్థలాన్ని కేటాయించడంతో పాటు భవనాన్ని కూడా నిర్మించి ఇస్తామన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఐలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు పానుగంటి కాలేబు, కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, చెలిమల రాములు, ధరిపల్లి చంద్రం, లక్ష్మయ్య, కార్మిక నాయకులు రెబ్బ రామారావు పాల్గొన్నారు.