కథలొద్దు.. పని చేయండి!
కొండపి, న్యూస్‌లైన్ : కథలు చెప్పటం మాని విధులు సక్రమంగా నిర్వహించాలని కొండపి క్లష్టర్ వైద్యశాల సిబ్బందిపై డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లష్టర్ వైద్యశాలను శనివారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి విధులుకు గైర్హాజరైన సిబ్బంది పేరు ఎదుట గ్రీన్ మార్కు పెట్టారు. ప్రసవాల రిజిష్టర్ ఎక్కడని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. వైద్యశాలలో రెండు నెలలుగా ప్రసవాలు ఎందుకు తగ్గాయని డీఎంహెచ్ఓ నిలదీశారు. స్టాఫ్‌నర్స్ ఏదో చెప్పబోగా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జిల్లాలో ఏ ఆస్పత్రిలో తగ్గని కాన్పుల సంఖ్య ఇక్కడే ఎందుకు తగ్గిందని మండిపడ్డారు. ఒక క్లష్టర్ వైద్యశాలలో నెలకు కనీసం 50 కాన్పులు చేయాలని సూచించారు. ప్రజలకు సేవలు సక్రమంగా అందిస్తే వారికి ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం పెరుగుతుందన్నారు. కాన్పుల ప్రోత్సాహక నగదు పంపిణీలో అవకతవకలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓపీ రిజిష్టర్‌ను పరిశీలించి ఓపీల సంఖ్య ఇంకా పెరగాలన్నారు.
ప్రసవాల కోసం వచ్చే రోగులకు వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది ఫోన్ నంబర్, వివరాలు బోర్డు మీద రాసి ఉంచాలని ఎస్పీహెచ్ఓ వాణిశ్రీని ఆదేశించారు. అనంతరం వైద్యశాల పరిసరాలను పరిశీలించి డీఎంహెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు.
సాధారణ తనిఖీల్లో భాగంగానే వైద్యశాలకు వచ్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోగులకు మంచినీటి వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వసతులు పెంచి రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ చంద్రయ్య వివరించారు.