ఒంటరి
కవిత
నేనిపుడే వస్తా ఒక మనిషిని కలిసి ఒంటరిననుకుంటున్న ఒక మనిషిని కలిసి పరమ ఏకాకితనంలో మునిగిపోయిన ఒక మనిషిని కలిసి ఇపుడే వస్తా.
‘కలిసి ఏం చేస్తావ్?’ నువ్వు అడుగుతావు ఏం చేయను, అలా చేయి పట్టుకు కూచుంటా- భుజం మీద చెయ్యేసి హత్తుకుంటా-
మాటలు నిరర్థకమైనపుడు స్పర్శ మాట్లాడుతుందనుకుంటా. బహుశా అతనికి తెలియదు అతనెంత ఒంటరో నేనూ అంతేనని.
అంత దూరం పోయి నన్ను నేను కలిసి వస్తానేమో
- కె.శివారెడ్డి