నవశక్తి క్లబ్‌కు కబడ్డీ టైటిల్
నరేంద్ర మోడి చాలెంజ్ కప్ కబడ్డీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నరేంద్రమోడి చాలెంజ్ కప్ కబడ్డీ టోర్నమెంట్ టైటిల్‌ను ఖైరతాబాద్‌కు చెందిన నవశక్తి క్రీడా మండలి క్లబ్ జట్టు చేజిక్కించుకుంది. కార్వాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో తాళ్లగడ్డలోని రాజలింగం కబడ్డీ మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో నవ శక్తి క్లబ్ జట్టు 24-19 పాయింట్ల తేడాతో సరూర్‌నగర్‌కు చెందిన జ్యోతి యూత్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది.
తొలి అర్ధభాగం ముగిసే సమయానికి నవశక్తి క్లబ్ జట్టు 12-7తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్ అవార్డును రాఘవేంద్ర (నవశక్తి క్లబ్) గెలుచుకోగా, బెస్ట్ కోచింగ్ అవార్డు నిఖిల్(జ్యోతి క్లబ్)కు లభించింది. ఈ పోటీల ముగింపు వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శానససభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాథోడ్, హైదరాబాద్ కబడ్డీ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.