కడపలో పోలింగ్ ప్రశాంతం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: కడప నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలో 2,71,532 మంది ఓటర్లుండగా 1,70,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 62.67గా నమోదైంది. ఈ సారి కడపలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే ఈవీఎంలు మొరాయించడం, ఇతరత్రా సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు.
పోలింగ్ సందర్భంగా ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం, సాయంత్రం బాగా జరిగిన పోలింగ్ మధ్యాహ్నం మందకొడిగా సాగింది. ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాల్లో సందడి కనిపించలేదు. గతంలో ఓటు వేస్తున్న చోట కాకుండా వేరే పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తలకు కూడా వేర్వేరు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. రెండు ఇళ్లకు ఒకే పోలింగ్ కేంద్రం రాలేదంటే ఎంత గంద రగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఓటర్లకు సాధ్యమైనంత వరకూ దగ్గరగా ఉండే పోలింగ్ కేంద్రాలను కేటాయించాలి. కానీ చాలా వార్డులలో పరిస్థితి ఇందుకు భిన్నంగా జరిగింది. 3వ డివిజన్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. స్లిప్పులున్నవారైతే దూరమైనా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటే శారు. కానీ స్లిప్పులు లేని వారైతే ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ చక్కర్లు కొట్టారు. 32వ వార్డు పరిధిలోని బెల్లంమండి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మిషన్ వద్ద వెలుతురు లేకపోవడంతో గుర్తులు కానరాక వృద్ధులు ఇబ్బంది పడ్డారు.
పత్తాలేని బీఎల్ఓలు : స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రం వద్ద బీఎల్ఓలు అందజేస్తారని ఎన్నికల అధికారులు తెలిపినా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓల జాడ కానరాలేదు. ఓటర్లు తమ ఓటరు కార్డు పట్టుకుని స్లిప్పులు లేక, పోలింగ్ ఎక్కడో తెలియక సమస్యలు ఎదుర్కొన్నారు. మొత్తమ్మీద మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.