ఐక్య పోరాటాలతోనే తెలంగాణ
రెబ్బెన, న్యూస్‌లైన్ :తెలంగాణ ప్రాంతంలోని అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి పోరాటాలు కొనసాగించినప్పుడే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్శంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు.
స్థానిక సంఘాలను కూడగట్టుకుని వీరోచిత పోరాటాలు చేసిన ధీరురాలని, నేటి మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇనాళ్లకు ప్రజలు కన్న కల నెరవేరబోతోందని, అయితే రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని వివరించారు.
తెలంగాణవాదులపై దాడులకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ర్ట ఏర్పాటును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రజక సంఘం మండల అధ్యక్షుడు రామడుగుల శంకర్, కార్యదర్శి సత్తయ్య, టీఆర్ఎస్ రెబ్బెన పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు రాజాగౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు శంకర్, రాజేందర్, మన్నెవార్ సేవా సమితి మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.