ప్రారంభోత్సవానికి ఎదురుచూపు
సాక్షి, మంచిర్యాల : దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందించాలనే సంకల్పం నెరవేరడం లేదు. ఈ ఖరీఫ్‌లోనూ ఈ పథకం నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో పనులు పూర్తి కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. తాజాగా ఆయా ప్రాజెక్టుల పనుల కొనసాగింపును ప్రభుత్వం ఇటీవల సమీక్షించిన నేపథ్యంలో గూడెం ఎత్తిపోతల పథకం చర్చనీయాంశమైంది. మరో వైపు దాదాపు తొంబై శాతం పనులు పూర్తయిన ఈ పథకం పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇదీ నేపథ్యం..
జలయజ్ఞం పథకంలో భాగంగా గూడెం గోదావరి నది ఒడ్డున ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి రూ.125 కోట్లు మంజూరు చేసి 2009, జనవరి 27న నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు మొదలైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. పథకం నిర్మాణం పనులు చి వరి దశకు చేరుకున్నా పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ కోసం రూ.22 కోట్లతో వ్యయంతో చేపట్టిన 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. పథకం ప్రారంభానికి ఇనాళ్లు సబ్‌స్టేషన్ నిర్మాణ ం పనులు అడ్డంకిగా మారాయి. సబ్‌స్టేషన్ నిర్మాణంలో మరో పదిశాతం పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసే దిశలో అధికారులు నిమగ్నమయ్యారు.
పథకం ఉద్దేశం..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కడెం ఆయకట్టు చివరి దాక నీరందించడానికి గూడెం గోదావరి ఒడ్డున ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఇక్కడి పంపింగ్ స్టేషన్ నుంచి మండలంలోని తానిమడుగు వరకు 11 కిలో మీటర్ల పొడవున 2.30 మీటర్ల వ్యాసం గల పైపులైన్ నిర్మించారు. తానిమడుగు వద్ద నిర్మించిన డెలివరి పాయింట్ ద్వారా నీటిని కడెం ప్రధాన కాల్వలో అనుసంధానం చేయనున్నారు. అక్కడ నుంచి కడెం ఆయకట్టు చివరిదాక సాగునీరు సరఫరా కానుంది.
ఆయకట్టు వివరాలు..
ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీల నీటిని 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తారు. దండేపల్లి మండలంలో 13 గ్రామాలు, 11,202 ఎకరాలు.. లక్సెట్టిపేట మండలంలో 22 గ్రామాలు, 12,498 ఎకరాలు, మంచిర్యాలలో 13 గ్రామాలు 6,300 ఎకరాలకు సాగు నీరందించాలని రూపకల్పన చేశారు.
సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి కాగానే..
గూడెం ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. అవి పూర్తికాగానే పథకం ట్రయల్ రన్ చేసి ప్రారంభిస్తాం.