‘లెనోరా’లో ఏఆర్టీ శస్త్రచికిత్స సక్సెస్
దేశంలోనే తొలిసారిగా స్వదేశీ కృత్రిమ దవడ ఎముక కీలు అమరిక
రాజానగరం: దవడ ఎముకలు అతుక్కుపోవడంతో ఆహారం తినే అవకాశం లేక బాధపడుతున్న 28 ఏళ్ల మహిళకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కేఎల్ఆర్ లెనోరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్‌లో మంగళవారం అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ‘అల్లోప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపొరోమాన్డిబ్లార్(ఏఆర్టీ) జాయింట్’ అనే ఈ శస్త్ర చికిత్సలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలో తయారుచేసిన కృత్రిమ దవడ కీలును వినియోగించారు. వివరాలు... పశ్చిమ గోదావరి జిల్లా ఆరికిరేవులకు చెందిన కడియం ఝాన్సీకి పుట్టుకతోనే ఆహారం తినడంలో సమస్య ఉంది.
ఆమె గత నెల 17న లెనోరా దంత వైద్యశాలకు రాగా పరీక్షించిన వైద్యులు సమస్యను గుర్తించి, ఏఆర్టీ జాయింట్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే విదే శాల్లో తయారుచేసిన కృత్రిమ దవడ ఎముక జాయింట్‌ని వాడితే రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. రోగి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్యులు చెన్నైకి చెందిన మీనాక్షి అమ్మాళ్ డెంటల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నీలకందన్ని సంప్రదించగా స్వదేశీ పరిజ్ఞానంతో దవడ ఎముక జాయింట్ ఉచితంగా తయారు చేసి ఇవ్వగలనన్నారు.
ఆయన రూపొందించిన జాయింట్‌ను మంగళవారం తొమ్మిది గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి రోగికి అమర్చామని లెనోరా కళాశాల కార్యదర్శి డాక్టర్ వై. మధుసూధనరెడ్డి తెలిపారు. డాక్టర్ నీలకందన్, డాక్టర్ దర్పన్ భార్గవ్, డాక్టర్ వి.దర్సింగ్ ఆధ్వర్యంలో డాక్టర్ పి. నవేన్ , డాక్టర్ డి.శ్రీకాంత్, డాక్టర్ ఎం. వైష్టవి, డాక్టర్ వేణుగోపాల్‌ల బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. కాగా ఈ శస్త్ర చికిత్సను రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన పీజీ విద్యార్థులకు లైవ్‌లో చూపి, వివరించారు.