అధికార రాజకీయం!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న కక్కుర్తి రాజకీయాలకే కాదు.. అధికార యంత్రాంగానికీ పాకింది. అసలే రాష్ట్రంలో ప్రభుత్వం లేదు.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో తెలీదు. ఎన్నికల వేళ జిల్లాపై పెత్తనమంతా అధికార యంత్రాంగానిదే.. నిధులూ విధులూ అన్నీ వారి కనుసన్నల్లో సాగాల్సిందే. సరిగ్గా ఇదే అంశం జిల్లా అధికార యంత్రాంగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీసింది. కీలక స్థానాలన్నింటిలోనూ తనవాళ్లే ఉండాలన్న వ్యూహంతో ఓ ఉన్నతాధికారి పావులు కదుపుతున్నారు. దాని ఫలితమే జిల్లా పరిషత్తు సీఈవో కైలాస గిరీశ్వర్ ఆకస్మిక బదిలీ. ఈ ఒక్కటే కాదు.. ఇటీవల జిల్లాలో మరో ఇద్దరు ఉన్నతాధికారుల పోస్టింగులు కూడా వివాదాస్పదమయ్యాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పరిషత్తు సీఈవో కైలాస్ గిరీశ్వర్ను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసింది. ఆయ న్ను బదిలీ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనకు ప్రస్తుతానికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జి సీఈవోగా ఉన్న ఇ.నాగార్జున సాగర్‌ను జిల్లా జెడ్పీ కొత్త సీఈవోగా నియమించారు. ఎన్నికల వేళ ఈ బదిలీ సాధారణం అనుకోవడానికి లేదు. జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ బదిలీ జెడ్పీ కేంద్రంగా కొంతకాలంగా ఉన్నతాధికారుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి పరాకాష్ట. జెడ్పీని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఓ ఉన్నతాధికారి భావించడమే దీనికి ప్రధాన కార ణం. ఇందుకోసం తెరవెనుక చాలా తతంగమే నడిచింది. అందులో కొన్ని కీలక ఘట్టాలు ఏమిటంటే..
ఇటీవల జెడ్పీ పరిధిలోని పంచాయతీ కార్యదర్శుల పోస్టులను క్రమబద్ధీకరించారు. ఈ వ్యవహారంలో ఆర్థిక అంశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పం చాయతీ కార్యదర్శుల నుంచి కొంత మొత్తం చొప్పున వసూలు చేయాలని ఓ ఉన్నతాధికారి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దానికి మరోఅధికారి అంగీకరించ లేదు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి.
జెడ్పీ జనరల్ నిధులతో ఫర్నిచర్ కొనుగోలు అంశం కూడా జిల్లా ఉన్నతాధికారుల మధ్య చిచ్చు పెట్టింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల కోసం రూ.4 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు చేయాలని ఉన్నతాధికారి భావించారు. కేంద్రమంత్రి కృపారాణి అనుచరుడు టెక్కలిలో నిర్వహిస్తున్న ఫర్నిచర్ దుకాణం నుంచే వీటిని కొనుగోలు చేయాలని సూచించారు. రూ.4 కోట్ల విలువైన కొనుగోళ్లు ఏకమొత్తంగా జరపాలంటే టెండర్లు పిలవాలి. దాంతో టెండర్ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఓ ఎత్తుగడ వేశారు. ఆ రూ.4 కోట్ల టెండరును చిన్న చిన్న భాగాలు చేసి అన్నింటినీ ఒకరికే అప్పగించాలన్నది పన్నాగం. అందుకోసం పరీక్ష కేంద్రాల హెడ్ మాస్టర్ల నుంచి ఫర్నిచర్ కోసం ప్రతిపాదనలు కోరారు. ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల ఫర్నిచర్‌ను టెక్కలిలో తాము సూచించిన ఏజెన్సీ నుంచి కొనేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఆ బిల్లులను జెడ్పీకి పంపించాలని సూచించారు. అలా చేస్తే టెండర్ ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా రూ.4కోట్ల కాంట్రాక్టును అస్మదీయుడికి కట్టబెట్టవచ్చు. తామూ కమీషన్లు దండుకోవచ్చని భావించారు. ఇందుకోసం జెడ్పీలో అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్‌ను కేటాయించాలని ఉన్నతాధికారి చెప్పారు. అందుకు సీఈవో కైలాస్ గిరీశ్వర్ సమ్మతించలేదు.
పస్తుతం జెడ్పీలో నిధులు లేవని, ఇతర నిధులు సర్దుబాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. దాంతో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి.ఇలా ఒక్కో అంశంలో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు పెరగుతూ వచ్చా యి. సీఈవోను కాదని కిందిస్థాయి అధికారులతో జె డ్పీ వ్యవహారాలను చక్కబెట్టసాగారు. దాంతో ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రరూపు దాల్చింది. సీఈవో జెడ్పీ కార్యాలయానికి రావడం తగ్గించేశారు. దీన్నే అవకాశంగా తీసుకుని సీఈవోపై ఉన్నతాధికారి పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే శారు. ఆయన విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని చెప్పారు. ఆ నెపంతో సీఈవోను బదిలీ చేయిం చాలన్నది ఆయన ఎత్తుగడ. ఒక దశలో ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయించాలని కూడా భావిం చినట్లు తెలుస్తోంది. అనుకున్నంతా అయ్యింది... సీఈవో గిరీశ్వర్ను బదిలీ చేశారు. అయి తే ఆయనకు ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చారా? అసలు బదిలీ చేశారా?? ప్రభుత్వానికి సరెండర్ చేశారా??? అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
మరికొన్ని అధికార స్థానాల్లోనూ!...
జిల్లాలో ఇటీవల రెండు అధికార స్థానాల భర్తీ వ్యవహారం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. జేసీగా రెండు నెలల క్రితం ఉషారాణిని ప్రభుత్వం నియమించినా ఆమె విధుల్లో చేరలేదు. జిల్లా అధికా ర యంత్రాంగంలో ఉన్న పరిస్థితిపై అవగాహన ఉ న్నందునే ఆమె జిల్లాకు వచ్చేందుకు సుముఖత చూప లేదని సమాచారం. దాంతో ఉషారాణికి ప్రభుత్వ మరో చోట పోస్టింగ్ ఇచ్చింది. టెక్కలి ఆర్డీవోగా ఈ నెల 12న ఎం.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరిం చారు. కానీ అంతలోనే ఆయన్ను బదిలీ చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచ ఆర్డీవోగా ఉన్న ఎం.శ్యామ్‌ప్రసాద్‌ను టెక్కలి ఆర్డీవోగా నియమించారు. ఆయన మంగళవారం విధుల్లో చేరారు. ఇలా పది రోజుల్లోనే ఆర్డీవో బదిలీ కావడంపై కలకలం రేపింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార యంత్రాం గంలో మరెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.!
‘ఫర్ సీఈవో’ సంతకం
ఇటీవలి కాలంలో జెడ్పీకి సంబంధించిన పలు ఫైళ్లపై డిప్యూటీ సీఈవో రమేష్ సంతకాలు చేశారు. ‘ఫర్ సీఈవో’ పేరుతో సంతకాలు చేసేయడం వివాదాస్పదమైంది. దీన్ని సీఈవో కైలాస్ గిరీశ్వర్ ప్రశ్నిం చారు. తాను విధుల్లో ఉండగా ఎలా సంతకాలు చేస్తారని డిప్యూటీ సీఈవోను నిలదీసినట్లు తెలుస్తోంది. ఓ ఉన్నతాధికారి చెబితేనే అలా చేశానని ఆయన చెప్పినట్లు సమాచారం. దానిపై సీఈవో మనస్తాపం చెందారు.
అలా పెట్టకూడదు
ఈ విషయంపై సీఈవో కైలాస్ గిరీశ్వర్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా బదలీపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తాను విధుల్లో ఉండగా డిప్యూటీ సీఈవో ‘ఫర్ సీఈవో’ పేరుతో సంతకాలు చేయడం సరికాదన్నారు. ఆ విషయంపై ఆయన్ను ప్రశ్నించానని కూడా చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఈవో రమేష్‌ను సంప్రదించగా ఆయన సరిగ్గా స్పందించలేదు.
-కైలాస్ గిరీశ్వర్