బైక్ అదుపుతప్పి ఫొటోగ్రాఫర్ దుర్మరణం
గణపురం, న్యూస్‌లైన్ : బైక్ అదుపుతప్పి సిమెంట్ పోల్‌కు ఢీకొని ఓ ఫొటోగ్రాఫర్ దుర్మరణం పాలైన సంఘటన మండలంలోని చెల్పూర్ శివారులోని ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లికి చెందిన మేడి రాజేష్(25), ఇదే పట్టణానికి చెందిన అతడి మిత్రుడు గంజి నరేష్ కలిసి ఆదివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బైక్‌పై బయల్దేరారు.
ఎక్కడి వెళ్లారోగానీ వారు కాకతీయలాంగ్‌వాల్ 100 ఫీట్ల రోడ్డు మీదుగా భూపాలపల్లి వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రాసింగ్ దగ్గర ఉన్న సిమెంట్ పోల్స్‌ను ఢీకొంది. దీంతో రాజేష్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ నరేష్‌ను 108లో స్థానికులు పరకాల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాజేష్ తల్లిదండ్రులు లక్ష్మి, కిష్టయ్య, సోదరుడు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
మృతుడి తల్లి బోరున విలపిస్తూ స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆమెను సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి 14 సంవత్సరాలుగా సింగరేణి భూపాలపల్లి ఏరియా 5ఇంక్లయిన్ బావిలో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. మృతుడు ఆవుట్‌డోర్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా రాజేష్ ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని, ప్రమాదంతోనే సమాచారం తెలిసిందని ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదని రాజేష్‌వెంట ఉన్న మరో వ్యక్తి కూడా తమకు పెద్దగా పరిచయం లేదని మృతుడి తండ్రి కిష్టయ్య విలపిస్తూ తెలిపారు.
సంఘటన స్థలానికి గణపురం, భూపాలపల్లి పోలీసులు వ చ్చారు. సంఘటన స్థలం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెల్పూర్ కార్యదర్శిని సంఘటన స్థలానికి పిలిపించారు. రాత్రి వరకు పోలీస్‌స్టేషన్ పరిధి నిర్ధారణ కాకపోవడంతో కేసు నమోదు కాలేదు.