రూపా గంగూలీపై దాడి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకురాలు రూపా గంగూలీపై గర్తు తెలియని దుండగులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కాక్ డ్విప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వరిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బీజేపీ కార్యకర్తను పరామర్శించి కాక్ డ్విప్ నుంచి తిరిగొస్తుండగా దుండగులు ఆమెపై దాడి చేశారు.
టీఎంసీ మద్దతుదారుల దాడిలో గాయపడి కాక్ డ్విప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా కొంతమంది గామస్తులు ఆమె కారును అడ్డుకున్నారు. ఆమెపై చేయి చేసుకున్నారు. ఆమె కారు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రూపా గంగూలీ తలకు గాయం కావడంతో ఆమెను డైమండ్ హార్బర్ ఆస్పత్రికి తరలించారు.
స్థానిక టీఎంసీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. దాడికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలానికి భారీగా పోలీసులను తరలించారు.